యింగ్లీషులో తొలినాటి నవలలు చాలావరకూ "పికరస్క్" మార్గంలోనే నడిచాయి. "పికరస్క్" అనే స్పానిష్ మాట పికరో అనే పదంలోంచీ పుట్టింది. "పికరో"కు అనాధ, దిమ్మరి, నిరక్షరాస్యుడైన అనాగరికుడు అనే అర్థాలున్నాయి. యీ నవలా ధోరణికి మూలపురుషుడని చెప్పవలసిన "సెర్వాంటెస్" అనే స్పానిష్ రచయిత ఆనాటి "రొమాన్సు"లను వ్యంగ్య ధోరణిలో యెగతాళి చేయడం కోసమని "డాన్ క్విక్సోట్"అనే నవలను రాశాడు. ఆ పుస్తకమే తరువాతి పికరస్క్ నవలలకన్నిటికీ మార్గదర్శకమయ్యింది.
యీ నవలల్లోని అనాథ(పికరో) బతుకు తెరువు కోసం రకరకాల యజమానుల దగ్గర వుద్యోగాలకు కుదురుతాడు. క్రమంగా వొక యజమానిని భరించలేక యింకో పని వెతుక్కుంటూ అతను పారిపోవడమో లేకపోతే ఆ యజమాని తరమగొడితే యింకో వుద్యోగం వెతుక్కోవడమో జరుగుతూ వుంటుంది. యీ అనుభవాలన్నీ కలిపితే ఆనాటి సమాజం సాక్షాత్కరిస్తుంది. అనాథ, అనాగరికుడు అని అనుకునే ప్రధాన పాత్ర సమకాలీన సమాజాన్ని కొలిచే సాధనమైపోతుంది. ఆ సమాజపు దుర్మార్గాన్నీ, అనాగరికతనూ దులిపేసే వ్యంగ్య రచనగా తయారవుతుంది. కావలిస్తే రచయిత ఆ పాత్రకు మరికొన్ని అనుభవాలను కలిపి నవలను పెద్దదిగానూ మార్చవచ్చు. లేకపోతే కొన్ని అనుభవాలను తీసేసి చిన్నదిగానూ తయారు చేయవచ్చు. శిల్పరీత్యా యీ సౌలభ్యాన్ని రచయిత ఎలా ఉపయోగించుకున్నాడన్న విషయం పైన ఆ రచయిత ప్రతిభ ఆధారపడి వుంటుంది.
హెన్రీ ఫీల్డింగ్స్ రాసిన " జోసెఫ్ ఆండ్రూస్," టామ్ జోన్స్", లయోన్ లో ట్రిల్లింగ్ రాసిన "హంప్రీ క్లింకర్", లాంటి నవలలు పికరస్క్ నవలలే! యీ ధోరణి చార్లెస్ డికెన్స్"డేవిడ్ కాపర్ ఫీల్డ్", "నికొలాస్ నికిల్ బై"..,మార్క్ ట్వయిన్,"టామ్ సాయర్","హకిల్ బెరీఫిన్" నవలల్లో వున్నత ప్రమాణాలకు చేరుకుంది.
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి నవల,"జంగమదేవర" అచ్చమైన పికరస్క్ నవల. యీ నవలలోని విద్యాసాగర్ యింటినించీ పారిపోయిన కుర్రాడు. అంతంతమాత్రం చదువు సంధ్యలతో మిగిలినవాడు. జీవితం విసిరేసినట్టల్లా విసురుకెళ్ళినవాడు. చెన్నై, గోవా, బెంగళూరులన్నీ చుట్టుకుని చిత్తూరుజిల్లా పశ్చిమ కొసలో వుండే "ముష్టూరు" అనే చిన్న గ్రామంలో తేలినవాడు. భారతీయ రైల్వేలకు స్వయం ప్రకటిత అతిథిగా, హోటల్లో క్లీనరుగా, సర్వరుగా, పుల్లొంకాయల వ్యాపారిగా రకరకాల పనులు చేసి, చివరకు పల్లెటూర్లో స్వంతంగా బడి పెట్టుకుని వుపాధ్యాయుడుగా స్థిరపడినవాడు.
నగర జీవితాలతోబాటూ, పల్లెటూరి బతుకుల్ని కూడా కలగలిపి యీ నవల యీ కాలపు పూర్తి చిత్రాన్ని పాఠకుడికి పరిచయం చేస్తుంది. పధ్నాలుగేళ్ళ విద్యాసాగర్ అనుభవాలు టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ ల జీవితాల్ని జ్ఞాపకం చేస్తాయి. మార్క్ ట్వయన్, డికెన్స్ ల లాగానే యీ రచయిత కూడా తన బాల్య జ్ఞాపకాలకు తన తోటి మిత్రుల అనుభవాల్ని కలిపి విద్యాసాగర్ అనే పాత్రను రూపొందించాడని అర్థమవుతుంది. యిటువంటి పాత్రలు కొన్నిసార్లు రచయితల గొంతుకలుగానూ, యింకొన్నిసార్లు ప్రతీకలుగానూ మరికొన్ని సార్లు వట్టి పాత్రలుగానూ కనిపిస్తాయి. వీటితో నిమిత్తంలేని సాధారణ పాఠకుడు కథతోబాటూ సాగిపోతూ వుంటాడు. "విద్యాసాగర్" పాత్ర పాఠకుడికి నేరుగా జీవితంలోంచీ తీసుకున్న పాత్రగానే పొడగడుతుంది.
యీ నవలలోని సమాజం అన్ని సమాజాల్లాగే దుర్మార్గపు ఆర్థిక కేంద్రీకరణలతోనూ, కులతత్వపు రోగాలతోనూ, అప్రజాస్వామిక ధోరణులతోనూ నిండినదే! అమాయకుడూ, మంచివాడూ, నీతిపరుడూ అయిన విద్యాసాగర్ అటువంటి సమాజంతో పోరాటం చేయక తప్పదు. అతడి విజయాలూ, అపజయాలూ ఆ సమాజపు చీకటి కోణాలనంతా ఆవిష్కరిస్తాయి. అతడి అనుభవాలు అతడ్ని మరింత మానవీయంగా మారుస్తాయి. అయితే అలా వొకరిద్దరు మారినంత మాత్రాన సమాజమేమీ మారిపోదు. కానీ, విజ్ఞానవంతులుగా యెదిగిన వ్యక్తులు కొందరు ఆ సమాజాన్ని మార్చడానికి నిర్విరామంగా పని చేస్తున్నారన్న స్పృహ పాఠకుల్ని వుత్తేజితుల్ని చేస్తుంది.
నైతిక విలువలు దిగజారిపోవడానికి వ్యక్తి కారణమా? సమాజం కారణమా? అన్నది పెద్ద ప్రశ్న. "రాబిన్ సన్ క్రూసో"లో రచయిత డానియల్ డీఫో పొరబాటు సమాజానిదే అనీ, వొక వ్యక్తిని సమాజం నుంచీ దూరంగా తీసుకెళ్ళి వొంటరి ద్వీపంలో విడిచిపెడితే అతగాడు సహజమూ, విజయవంతమూ అయిన జీవితాన్ని గడపగలడనీ నిరూపిస్తాడు. అయితే " లార్డ్ ఆఫ్ ఫ్లయిస్ అనే నవలలో విలియం గోల్డింగ్ యీ నైతిక పతనానికి మనిషిలో వుండే అసంపూర్ణత, స్వార్థమూ కారణాలని గుర్తిస్తాడు. యీ ప్రశ్న అనాది నించీ వున్నదే! రకరకాల రచయితలు వేర్వేరు కాలాల్లో భిన్నమైన అభిప్రాయాలను ప్రతిపాదించారు. వీటిలో ఏది సత్యమో తేల్చుకోవలసిన బాధ్యత పాఠకులదే. అలా యీ నవలలు పాఠకుల్ని ఆలోచనాశీలురుగా మారుస్తాయి.
రాయలసీమలో బైరాగులు"స్థావర జంగమాత్మకమైన లోకం" అని పేర్కొంటారు. పశ్చిమగోదావరి జిల్లా కోపల్లె నించీ వచ్చి చిత్తూరు జిల్లా పశ్చిమ తాలూకా ముష్టూరులో జీవించిన జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తికి యీమాట బాగా పట్టుబడిపోయింది. అందుకే ముందుగా స్థావరం గురించి "వలస దేవర" అనే నవల రాశారు. యిప్పుడు జంగమాత్మకం గురించి "జంగమదేవర" రాశారు. ఆ నవలను ప్రాచుర్యం చేసిన పాఠకులు, యీ నవలను కూడా సమాదరిస్తారని ఆశిస్తున్నాను.
- మధురాంతకం నరేంద్ర

No comments:
Post a Comment